Tuesday, October 30, 2007

హెలికాప్టర్ లు పంపించవచ్చు కదా????

ఆగష్ట్ పదిహేను పరేడ్ ల కోసం మాత్రమే హెలికాప్టర్ లు వాడతారా? ఆర్మీని కాని, నేవీని కానీ సహాయం ఆడిగితే చెయ్యరా? కడప జిల్లాలో ఉన్న ఎస్టేట్లు ఫొటోలు తియ్యడానికి మన రాజకీయ పార్టీలకు, వార్తాపత్రికలకు హెలికాప్టర్ లు దొరుకుతాయి కాని, మనుషులు కొట్టుకుపోతుంటే రక్షించడనికి ఉండవు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చెయ్యాడానికి, పొలిటికల్ మీటింగ్ లు హాజరు కావడనికి హెలికాప్టర్ లు ఉంటాయి కాని, దాదాపు 30 ప్రాణాలు బిక్కుబిక్కుమంటే రక్షించడానికి ఉండవు.
జాతీయ విపత్తు నివారణ సంఘంలో ఉన్న పెద్ద మనుషులు మాకు ప్రొటోకాల్ ప్రకారం కేబినేట్ మర్యాదలు జరగడం లేదు అన్న ఏడుపు తప్ప, మనకి 900కి.మీ. కోస్తా ఉంది ప్రతి సంవత్సరం వరదలు, తుఫానులు వస్తూ ఉంటాయి వాటి గురించి ఏమి చెయ్యాలి అని ఆలోచించరు. వారి "హైదరాబాదీ బ్రదర్" తో కలిసి ముఖ్యమంత్రి మీద పడి ఏడవడం తప్ప ఏమి చెయ్యరు.
ఖ్యాతినొందిన మన ప్రతిపక్ష నాయకుడు కోస్తాలో వరదలు వస్తూ ఉంటే తెలంగాణా లో రోడ్ షోలు చేసుకుంటారు. వరదలు పోయాక మళ్ళీ ఇదే కోస్తాకి వచ్చి వరి మద్దతు ధర గురించి మొసలి కన్నీరు కారుస్తారు.
నలుగు నెలల క్రితమే కదా కర్నూలు జిల్లాలో ఇంత భీభత్సం జరిగింది, మళ్ళీ అదే నెల్లూరు లో జరిగింది. మన ప్రభుత్వం, అధికారులు అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోరా? బస్సులు నీళ్ళలో కొట్టుకుపోవడం, ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అంత సామాన్యం అయిపోయిందా? ఎప్పుడో అర్దరాత్రి రైలు వంతెన తెగి మనుషులు చనిపోయారు అంటే, సహాయం చెయ్యడానికి అర్దరాత్రి పైగా అంత సమయం లేదు అనుకోవచ్చు, కానీ పట్టపగలు దాదాపు 30 మంది నీటిలో చిక్కుకున్నారు ఏ క్షణనైనా నీళ్ళు ముంచెయ్యవచ్చు అని తెలిసి, తరువాత కూడా గంటల సమయం ఉండి కూడా మనం వాళ్ళను కాపాడుకోలేకపోయాము అంటే నిజంగా మన అధికారులు/నాయకులను చూసి భయం వేస్తుంది. కాంట్రాక్టర్ల కోసం అఘమేఘాల మీద పని చేసే మన అధికారులు/నాయకులు సామాన్యుల ప్రాణాలను అస్సలు పట్టించుకోవడం లేదు.

వర్షాలు పడతాయో లేదో తెలియని మేఘమధనానికి కోట్లు ఖర్చు చేస్తారు కానీ, విపత్తులలో సహాయం చెయ్యడానికి ఒక్క హెలికాప్టర్ కొనడమో/కాంట్రాక్ట్ తిసుకోవడమో చెయ్యరు, ఎందుకంటే మేఘమధనానికి ఖర్చు పెడితే కమీషన్ మిగులుతుంది, అనంతపురంలో ఓట్లు పడతాయి, దీనికి ఖర్చు పెడితే ఏమి ఉపయోగం లేదు, పైగా మనది ఖర్మ భూమి కదా ఎవరయినా ఇలా చనిపోయినా అది వారి వారి ఖర్మగానే అనుకుంటారు కానీ ఇది ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలెవ్వరు లెక్కపెట్టరు అని నమ్మకం.

ఏ విపత్తు వచ్చినా, ఏమయినా ఎక్స్ గ్రేషియాతో లెక్కసరిచెయ్యవచ్చు అనుకునే మూర్ఖులు ఎప్పుడు నేర్చుకుంటారు, "prevention is better than cure" అన్న నిజం వీళ్ళకి నిజంగా తెలియదా? అభివృద్ది చెందటం అంటే స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ పెరగడం ఒక్కటే కాదు, ప్రజలకి అవసరం అయిన కనీస సౌకర్యాలు, ఇటువంటి విపత్తులలో చిక్కుకున్నవారిని క్షేమంగా గట్టెంకించడం కూడా. పరిస్తితి ఇలా ఉంటే మనం నిజంగా సూపర్ పవర్ అవ్వగలమా? ఆలోచించండి.

Tuesday, October 23, 2007

ప్రేమ వివాహం తప్పా?

ఇవ్వాళ సినీ నటుడు ప్రభాస్ వ్యాఖ్యానించాడు "ప్రేమ వివాహం లో తప్పేం ఉంది అని?". నిజం గా ఇందులో తప్పేమి లేదా? వివాహం అంటే ఇద్దరు మనుషుల మధ్య బంధమేనా? రెండు కుటుంబాల మధ్య బంధం కాదా?
ఇరు వైపులా రెండు కుటుంబాలు ఒప్పుకుని చేస్తే దానిలో తప్పేమీ లేదు.
మరి ఒక కుటుంబం ఒప్పుకుని ఒక కుటుంబం ఒప్పుకోకుండా చేసుకుంటే? ఆ ఒప్పుకోని కుటుంబానికి చెందిన వాళ్ళు తన కుటుంబానికి దూరం కావలిసిందే కదా? తల్లిదండ్రులు ఇంతకుముందులాగా మూర్ఖంగా అంతస్తులు, కులాలు అని చెప్పి అభ్యంతరం చెప్పట్లేదు. మొదట్లో వద్దు అన్నా కాని తరువాత వాళ్ళ ప్రేమని అర్దం చేసుకుని వాళ్ళే ఒప్పుకుంటున్నారు.
ఆ ప్రేమికులకు నిజంగా మానసిక పరిపక్వత వచ్చి వాళ్ళకు కావలసిన వాళ్ళను ఎంచుకుంటే పెద్దవాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు, కాని తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం చేసుకుంటము అంటే ఎవ్వరు ఒప్పుకోరు.18 సంవత్సరాల వయసుకి వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకునే అనుభవం వాళ్ళకు ఉంటుందా?
రేపు సమాజం లో అన్ని సవాళ్ళని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలరా? "అనుభవం అయితే కాని తత్వం బోధపడదు" అన్నట్లుగా కళ్ళకు కమ్మిన అందమైన పొర కరిగిపోగానే వాళ్ళు చేసిన తప్పు తెలిసి వస్తుంది, రోజు మీడియా లో, మన చుట్టుప్రక్కల ఎన్ని చూడడం లేదు.
పరిపక్వతతో కూడిన ప్రేమ, ప్రేమ వివాహం అద్భుతంగా ఉంటుంది. లేకుంటే చేసిన దాని గురించే తలుచుకుని భాధ పడేంత పరమ దుర్భరం గా జీవితం ఉంటుంది.
ఈ టపా ఎందుకు రాసానో నాకు తెలియదు, నాలో ఉన్న ఆలోచనలన్నీ అలా రాసేసాను, ఏదయిన తప్పుగా వ్యాఖ్యానించి ఉంటె క్షంతవ్యుడిని.

Wednesday, October 17, 2007

చిరంజీవి కూతురు ప్రేమ వివాహం

నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా...నాన్న, బాబాయ్, బావ, అన్నయ్య, మామయ్య.....అందరూ కలిసి సినిమాలలో చేసి చూపించింది చిరంజీవిగారి కూతురు నిజంగా చేసి చూపించింది....అంతే....