Saturday, February 23, 2008

తెలుగులో టైపు చెయ్యడం ఇప్పుడు తేలిక

ఇప్పుడు బ్లాగర్లో తెలుగులోనే టైపు చేసుకోవచ్చోచ్...శోధనగారికి నెనర్లు మొత్తానికి ఒక అరగంట కష్టపడ్డాక మొత్తానికి అన్ని సెట్ చేసుకుని మొదటిసారి తెలుగులో టైపు చేసేసాను...

వాదనల వల్ల అభిప్రాయాలు మారవు...

విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో రాజమండ్రి నుంచి వచ్చిన శీనుగాడు, సూర్రెడ్డి ఒక రూములో ఉండేవారు. ఆప్పుడప్పుడూ నేను వాళ్ళ రూముకి వెళ్ళేవాడిని. ఇక్కడ వీళ్ళ గురించి కొంచెం చెప్పాలి. శీనుగాడికి ఏ విషయం అయినా వాదించడం అంటే ఇష్టం.సూర్రెడ్డికేమో ఏదీ తెగేదాకా లాగటం ఇష్టం ఉండదు. మేము ఏదయినా టెక్నికల్ విషయాలు, సబ్జెక్ట్, రాజకీయాలు ఏవయినా కానీ చాలా ఉత్సాహంగా మాట్లాడుకునేవాళ్ళం. శీనుగాడేమో ఏ విషయమైనా సరదాకి వాదన మొదలెట్టేవాడు, ఆ వెంటనే సూర్రెడ్డి "వాదనల వల్ల అభిప్రాయాలు మారవు..." అనేసి అక్కడ నుంచి వెళ్ళిపొయేవాడు.

అప్పట్లో నాకు అర్దం కాలేదు కానీ, చెన్నపట్నం వచ్చాక ఆ డైలాగ్ అనుభవం ద్వారా అర్దం అయింది. ఇక్కడ మన టీంమేట్స్ తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏ విషయం కూడా వాదించ కూడదు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ మారవు, తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అని వాదిస్తారు, వెంటనే సూర్రెడ్డిని తను అప్పట్లో చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకుని వాళ్ళతో వాదన చెయ్యడం ఆపేస్తాను, లేకపోతే "రామాయణం ముందు తమిళంలో రాస్తే వాల్మీకి దాన్ని కాపీ కొట్టాడు...." అంటే మనమేం చెయ్యగలం....

Saturday, January 12, 2008

ఎక్కడుందీ సంక్రాంతి లక్ష్మి???

ఎక్కడుందీ సంక్రాంతి లక్ష్మి???

సంక్రాంతి అనగానే గుర్తు వచ్చేది పల్లెటూరు... నా చిన్నప్పుడు నేను అనుభవించిన బాల్యం అంతా నా కళ్ళ ముందు తిరుగుతుంది. సంక్రాంతికి పది పదిహేను రొజుల ముందు మా ఇంట్లోను, మా కిరాణా కొట్టులోను హడవిడి మొదలయ్యేది. నాన్నగారు తణుకు నుంచి తెప్పించిన బెల్లం బుట్టలతో, అప్పటికే తెప్పించిన వేరుశన నూనె డబ్బాలతో మా చిన్న ఇంటిని దానిలోనే ఉన్న కొట్టుని నింపేసేవారు. ఆ పదిరోజులు నాన్నగారు, అమ్మ, అన్నయ్య, చెల్లి, నేను ఎప్పుడు అన్నం తినేవాళ్ళమో తెలిసేదికాదు. రైతుమారాజులకి పంటలు చేతికి వచ్చే కాలం, సంవత్సరం అంతా తీసుకెళ్ళిన సరుకులకి అప్పుడే డబ్బు ఇచ్చే వారు.

సంక్రాంతికి మా ఊరిలో అందరి ఇళ్ళల్లోను అరిసెలు తప్పకుండా వండేవారు. దానికోసం ఒకొక్క రైతు బెల్లం బుట్టలతోను, నూనె డబ్బాలతోను తీసుకుని వెళ్ళేవారు. మాకు కూడా చేతి నిండా డబ్బు ఉండే కాలం, అందరు సంక్రాంతి కి కొత్త బట్టలు వేసుకుంటే మేమేమో పాత బట్టలేసుకుని కిరాణా కొట్లో పని చెయ్యడం చాలా బాధ అనిపించేది కాని, సంక్రాంతి వెళ్ళగానే మాకు కూడా నాన్నగారు కొత్త బట్టలు కొనేవారు. నాకు సంక్రాంతికి ఒక జత, పుట్టిన రోజుకి ఒక జత ఇలా సంవత్సరానికి రెండే కొత్త జతలు, మిగిలినప్పుడంతా అన్నయ్యకి పొట్టి అయిపోయిన బట్టలే, అందుకని సంక్రాంతి కోసం చాలా ఎదురు చూసేవాడిని. కొట్లో పని చెయ్యకుండా బయటికి పోయి ఆడుకుంటాను అంటే అమ్మ బ్రహ్మాస్త్రం ప్రయోగించేది, "కొట్లో ఈ పది రోజులు అల్లరి మాని పని చెస్తేనే కొత్త బట్టలు అని...".

పండగ మూడు రోజులు దగ్గరకి వచ్చే సరికి కొంచెం హడావుడి తగ్గేది, అమ్మకి, చెల్లికి తీరిక చిక్కేది, మా చిన్న ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో నింపేసేవారు, గొబ్బిళ్ళలో పెట్టడానికి నెల ముందు నుంచే పెరట్లో బంతి నారు పోసేవారు, సంక్రాంతికి పెద్ద పెద్ద ముద్ద బంతిపూలతో, రేగి పళ్ళతో గొబ్బెమ్మలని అలంకరించేవారు. బెల్లం తాటాకు బుట్టలలో చెరుకు గడ్డి కప్పి వచ్చేది, బుట్ట ఖాళీ అయిన వెంటనే నేను అన్నయ్య ఆ తాటాకు బుట్టని, చెరకు గడ్డిని అపురూపంగా మంచుకి తడవకుండా దాచుకునే వాళ్ళం. భోగి రోజు ఉదయాన్నే లేచి ఈ ఖాళీ బుట్టలన్నీ కలిపి పెద్ద భోగి మంట వేసేవాళ్ళం. అమ్మకి ఖాళీ ఉండదని మా పక్క ఊరిలోనే ఉండే మా పెద్దమ్మ మాకు అరిసెలు చేసి పంపించేది. సంక్రాంతి రోజుకి బేరం దాదాపుగా అయిపోతుంది, ఏ రోజు సరుకు ఆరోజు కొనుక్కునే కూలీలే కానీ రైతులేవరు తరువాత 20 రోజుల వరకు కొట్టు దగ్గరికి రారు.

సంక్రాంతి మధ్యాహ్నం నుంచి మమ్మల్ని వదిలేసేవారు, అప్పటి నుంచి తిరిగి బడి తెరిచే వరకు కోడి పందాలకి, సినిమాలకి, క్రికెట్ ఆటకి అంకితం అయిపోయేవాళ్ళం.

కాలం మారిపోయింది, ఇప్పుడు నేను ఊరికి దూరంగా చెన్నైలో ఉంటున్నాను, కిరాణా కొట్టు అన్నయ్య చూసుకుంటున్నాడు. మా మేనేజర్ దయతో సెలవు దొరికితే ఇంటికి వెళ్తాను, లేదంటే లేదు. వెళ్ళినా అక్కడ కూడా సంక్రాంతి ఇంతకు ముందులాగా జరగడంలేదు. గత కొద్ది సంవత్సరాలుగా రైతులకి అన్ని విధాలా కష్టాలే. ఇండియా బాగా అభివృద్ది చెందింది దాని ప్రభావం అన్ని ధరలపైనా పడింది ఒక్క రైతులకి చెల్లించే ధరలపైన తప్ప. ఇప్పుడు రైతులెవరూ సంక్రాంతి ముందులాగా చెసుకోవట్లేదు, ఒక్క సంవత్సరం లాభాలు వచ్చినా అంతకు ముందు చేసిన అప్పులపైన వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది, ఇంక పండగలు ఏమి పెట్టి చేసుకోమంటారు అని ఆడుగుతున్నారు.

కొందరు రైతుల పిల్లలు కష్టపడి డిగ్రీ వరకు చదివి హైదరాబాద్ రెడ్డి లాబ్స్, అరబిందో, హెట్రో డ్రగ్స్ లో పని చెస్తున్నారు, ఇంకొందరు నాలాగా అప్పులు చేసి ఎం.సి.ఎ లు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రతి నెలా ఇంటికి పంపే డబ్బే ప్రస్తుతం గ్రామ ఆర్ధిక వ్యవస్థకి ఊపిరులు ఊదుతోంది. గ్రామీణ భారతం చాలా కష్టాలలో ఉంది, ఒకప్పుడు రైతుల మీద ఆధారపడి సగర్వగా వర్ధిల్లన గ్రామ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం పరాన్న జీవిలాగ బ్రతుకుతోంది.

కన్‌జూమరిజం బాగ పెరిగింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేశాయి ఇండియా అభివృద్ది చెందింది అని చెప్పుకున్నా కూడా, పల్లెలలో రైతులు ఖర్చు పెట్టడం లేదు, ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, దాని ప్రభావం మా కిరాణా కొట్టు మీద కూడా పడింది.

రైతు బాగుంటేనే పల్లె బాగుంటుంది. రైతు కళ్ళల్లో ఆనందం ఉంటేనే సంక్రాంతి లక్ష్మి పల్లెకి వస్తుంది. సంక్రాంతి పట్నం పండగ కాదు, పల్లె పండగ. రైతులు ఆనందంగా లేరని పల్లెకి రాలేకపోతుంది, తనది కాని పట్టణానికి పోలేకపోతుంది, ప్రస్తుతం మా సంక్రాంతి లక్ష్మి ఎక్కడ ఉందో? మా పల్లెకి తిరిగి ఎప్పుడు వస్తుందో???

Sunday, December 23, 2007

కాబోయే ప్రధాని నరేంద్ర మోడీనా లేక రాహూల్ గాంధీనా...

మొత్తానికి నరేంద్ర మోడీ ఘన విజయాన్ని సాధించారు, ఇప్పుడు ఏమి జరుగుతుంది, వామ పక్షాలు యు.పి.ఎ. కి మద్దతు ఉపసంహరించే ధైర్యం చేస్తాయా? ఎల్.కె.అద్వానీ మోడీని ఎదుర్కోగలరా? గుజరాత్ ప్రజలు చాలా స్పష్టంగా తమ తీర్పు వ్యక్తం చేశారు, దీని వల్ల అయినా మెజారిటీ ప్రజలని నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుందో ప్రధాన రాజకీయ పార్టీలు గ్రహిస్తాయా? ఇంకా మైనారిటీ రాజకీయాలకే (కాంగ్రేస్ లాగా), కుల రాజకీయాలకే (బి.ఎస్.పి. లాగా) మొగ్గు చూపుతాయా...4 నెలల క్రితం అహ్మదాబాద్ నుంచి చెన్నై రైల్లో వస్తూ ఒక బరోడా వ్యక్తి తో మాట్లాడాను, తను మోడీ గురించి చెప్తూ "గుజరాత్ మోడీ పాలనలో చాలా మెరుగు పడిందని, గుజరాతీల కష్ట పడే స్వభావానికి మోడి సుపరిపాలన తోడై చాలా అభివృద్ది చెందిది" అని చెప్పాడు. అప్పుడే అనిపించింది మోడీ తిరిగి గెలవగలడు అని.ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల ముందు ఉన్న పెద్ద ప్రశ్న కాబోయే ప్రధాని ఎవరు? అభివృద్ది, హిందుత్వ, సుపరిపాలన, మెజారిటీ ప్రజలకు భద్రత లతో గెలిచిన మోడీనా? కుల రాజకీయాలతో గెలిచిన మాయావతా? మైనారిటీ రాఅజికీయాలకే మొగ్గు చూపే కాంగ్రేస్ పార్టీకి చెందిన పిల్ల కాకి రాహుల్ గాంధీయా?

Tuesday, October 30, 2007

హెలికాప్టర్ లు పంపించవచ్చు కదా????

ఆగష్ట్ పదిహేను పరేడ్ ల కోసం మాత్రమే హెలికాప్టర్ లు వాడతారా? ఆర్మీని కాని, నేవీని కానీ సహాయం ఆడిగితే చెయ్యరా? కడప జిల్లాలో ఉన్న ఎస్టేట్లు ఫొటోలు తియ్యడానికి మన రాజకీయ పార్టీలకు, వార్తాపత్రికలకు హెలికాప్టర్ లు దొరుకుతాయి కాని, మనుషులు కొట్టుకుపోతుంటే రక్షించడనికి ఉండవు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చెయ్యాడానికి, పొలిటికల్ మీటింగ్ లు హాజరు కావడనికి హెలికాప్టర్ లు ఉంటాయి కాని, దాదాపు 30 ప్రాణాలు బిక్కుబిక్కుమంటే రక్షించడానికి ఉండవు.
జాతీయ విపత్తు నివారణ సంఘంలో ఉన్న పెద్ద మనుషులు మాకు ప్రొటోకాల్ ప్రకారం కేబినేట్ మర్యాదలు జరగడం లేదు అన్న ఏడుపు తప్ప, మనకి 900కి.మీ. కోస్తా ఉంది ప్రతి సంవత్సరం వరదలు, తుఫానులు వస్తూ ఉంటాయి వాటి గురించి ఏమి చెయ్యాలి అని ఆలోచించరు. వారి "హైదరాబాదీ బ్రదర్" తో కలిసి ముఖ్యమంత్రి మీద పడి ఏడవడం తప్ప ఏమి చెయ్యరు.
ఖ్యాతినొందిన మన ప్రతిపక్ష నాయకుడు కోస్తాలో వరదలు వస్తూ ఉంటే తెలంగాణా లో రోడ్ షోలు చేసుకుంటారు. వరదలు పోయాక మళ్ళీ ఇదే కోస్తాకి వచ్చి వరి మద్దతు ధర గురించి మొసలి కన్నీరు కారుస్తారు.
నలుగు నెలల క్రితమే కదా కర్నూలు జిల్లాలో ఇంత భీభత్సం జరిగింది, మళ్ళీ అదే నెల్లూరు లో జరిగింది. మన ప్రభుత్వం, అధికారులు అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోరా? బస్సులు నీళ్ళలో కొట్టుకుపోవడం, ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అంత సామాన్యం అయిపోయిందా? ఎప్పుడో అర్దరాత్రి రైలు వంతెన తెగి మనుషులు చనిపోయారు అంటే, సహాయం చెయ్యడానికి అర్దరాత్రి పైగా అంత సమయం లేదు అనుకోవచ్చు, కానీ పట్టపగలు దాదాపు 30 మంది నీటిలో చిక్కుకున్నారు ఏ క్షణనైనా నీళ్ళు ముంచెయ్యవచ్చు అని తెలిసి, తరువాత కూడా గంటల సమయం ఉండి కూడా మనం వాళ్ళను కాపాడుకోలేకపోయాము అంటే నిజంగా మన అధికారులు/నాయకులను చూసి భయం వేస్తుంది. కాంట్రాక్టర్ల కోసం అఘమేఘాల మీద పని చేసే మన అధికారులు/నాయకులు సామాన్యుల ప్రాణాలను అస్సలు పట్టించుకోవడం లేదు.

వర్షాలు పడతాయో లేదో తెలియని మేఘమధనానికి కోట్లు ఖర్చు చేస్తారు కానీ, విపత్తులలో సహాయం చెయ్యడానికి ఒక్క హెలికాప్టర్ కొనడమో/కాంట్రాక్ట్ తిసుకోవడమో చెయ్యరు, ఎందుకంటే మేఘమధనానికి ఖర్చు పెడితే కమీషన్ మిగులుతుంది, అనంతపురంలో ఓట్లు పడతాయి, దీనికి ఖర్చు పెడితే ఏమి ఉపయోగం లేదు, పైగా మనది ఖర్మ భూమి కదా ఎవరయినా ఇలా చనిపోయినా అది వారి వారి ఖర్మగానే అనుకుంటారు కానీ ఇది ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలెవ్వరు లెక్కపెట్టరు అని నమ్మకం.

ఏ విపత్తు వచ్చినా, ఏమయినా ఎక్స్ గ్రేషియాతో లెక్కసరిచెయ్యవచ్చు అనుకునే మూర్ఖులు ఎప్పుడు నేర్చుకుంటారు, "prevention is better than cure" అన్న నిజం వీళ్ళకి నిజంగా తెలియదా? అభివృద్ది చెందటం అంటే స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ పెరగడం ఒక్కటే కాదు, ప్రజలకి అవసరం అయిన కనీస సౌకర్యాలు, ఇటువంటి విపత్తులలో చిక్కుకున్నవారిని క్షేమంగా గట్టెంకించడం కూడా. పరిస్తితి ఇలా ఉంటే మనం నిజంగా సూపర్ పవర్ అవ్వగలమా? ఆలోచించండి.

Tuesday, October 23, 2007

ప్రేమ వివాహం తప్పా?

ఇవ్వాళ సినీ నటుడు ప్రభాస్ వ్యాఖ్యానించాడు "ప్రేమ వివాహం లో తప్పేం ఉంది అని?". నిజం గా ఇందులో తప్పేమి లేదా? వివాహం అంటే ఇద్దరు మనుషుల మధ్య బంధమేనా? రెండు కుటుంబాల మధ్య బంధం కాదా?
ఇరు వైపులా రెండు కుటుంబాలు ఒప్పుకుని చేస్తే దానిలో తప్పేమీ లేదు.
మరి ఒక కుటుంబం ఒప్పుకుని ఒక కుటుంబం ఒప్పుకోకుండా చేసుకుంటే? ఆ ఒప్పుకోని కుటుంబానికి చెందిన వాళ్ళు తన కుటుంబానికి దూరం కావలిసిందే కదా? తల్లిదండ్రులు ఇంతకుముందులాగా మూర్ఖంగా అంతస్తులు, కులాలు అని చెప్పి అభ్యంతరం చెప్పట్లేదు. మొదట్లో వద్దు అన్నా కాని తరువాత వాళ్ళ ప్రేమని అర్దం చేసుకుని వాళ్ళే ఒప్పుకుంటున్నారు.
ఆ ప్రేమికులకు నిజంగా మానసిక పరిపక్వత వచ్చి వాళ్ళకు కావలసిన వాళ్ళను ఎంచుకుంటే పెద్దవాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు, కాని తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం చేసుకుంటము అంటే ఎవ్వరు ఒప్పుకోరు.18 సంవత్సరాల వయసుకి వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకునే అనుభవం వాళ్ళకు ఉంటుందా?
రేపు సమాజం లో అన్ని సవాళ్ళని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలరా? "అనుభవం అయితే కాని తత్వం బోధపడదు" అన్నట్లుగా కళ్ళకు కమ్మిన అందమైన పొర కరిగిపోగానే వాళ్ళు చేసిన తప్పు తెలిసి వస్తుంది, రోజు మీడియా లో, మన చుట్టుప్రక్కల ఎన్ని చూడడం లేదు.
పరిపక్వతతో కూడిన ప్రేమ, ప్రేమ వివాహం అద్భుతంగా ఉంటుంది. లేకుంటే చేసిన దాని గురించే తలుచుకుని భాధ పడేంత పరమ దుర్భరం గా జీవితం ఉంటుంది.
ఈ టపా ఎందుకు రాసానో నాకు తెలియదు, నాలో ఉన్న ఆలోచనలన్నీ అలా రాసేసాను, ఏదయిన తప్పుగా వ్యాఖ్యానించి ఉంటె క్షంతవ్యుడిని.

Wednesday, October 17, 2007

చిరంజీవి కూతురు ప్రేమ వివాహం

నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా...నాన్న, బాబాయ్, బావ, అన్నయ్య, మామయ్య.....అందరూ కలిసి సినిమాలలో చేసి చూపించింది చిరంజీవిగారి కూతురు నిజంగా చేసి చూపించింది....అంతే....