ఎక్కడుందీ సంక్రాంతి లక్ష్మి???
సంక్రాంతి అనగానే గుర్తు వచ్చేది పల్లెటూరు... నా చిన్నప్పుడు నేను అనుభవించిన బాల్యం అంతా నా కళ్ళ ముందు తిరుగుతుంది. సంక్రాంతికి పది పదిహేను రొజుల ముందు మా ఇంట్లోను, మా కిరాణా కొట్టులోను హడవిడి మొదలయ్యేది. నాన్నగారు తణుకు నుంచి తెప్పించిన బెల్లం బుట్టలతో, అప్పటికే తెప్పించిన వేరుశన నూనె డబ్బాలతో మా చిన్న ఇంటిని దానిలోనే ఉన్న కొట్టుని నింపేసేవారు. ఆ పదిరోజులు నాన్నగారు, అమ్మ, అన్నయ్య, చెల్లి, నేను ఎప్పుడు అన్నం తినేవాళ్ళమో తెలిసేదికాదు. రైతుమారాజులకి పంటలు చేతికి వచ్చే కాలం, సంవత్సరం అంతా తీసుకెళ్ళిన సరుకులకి అప్పుడే డబ్బు ఇచ్చే వారు.
సంక్రాంతికి మా ఊరిలో అందరి ఇళ్ళల్లోను అరిసెలు తప్పకుండా వండేవారు. దానికోసం ఒకొక్క రైతు బెల్లం బుట్టలతోను, నూనె డబ్బాలతోను తీసుకుని వెళ్ళేవారు. మాకు కూడా చేతి నిండా డబ్బు ఉండే కాలం, అందరు సంక్రాంతి కి కొత్త బట్టలు వేసుకుంటే మేమేమో పాత బట్టలేసుకుని కిరాణా కొట్లో పని చెయ్యడం చాలా బాధ అనిపించేది కాని, సంక్రాంతి వెళ్ళగానే మాకు కూడా నాన్నగారు కొత్త బట్టలు కొనేవారు. నాకు సంక్రాంతికి ఒక జత, పుట్టిన రోజుకి ఒక జత ఇలా సంవత్సరానికి రెండే కొత్త జతలు, మిగిలినప్పుడంతా అన్నయ్యకి పొట్టి అయిపోయిన బట్టలే, అందుకని సంక్రాంతి కోసం చాలా ఎదురు చూసేవాడిని. కొట్లో పని చెయ్యకుండా బయటికి పోయి ఆడుకుంటాను అంటే అమ్మ బ్రహ్మాస్త్రం ప్రయోగించేది, "కొట్లో ఈ పది రోజులు అల్లరి మాని పని చెస్తేనే కొత్త బట్టలు అని...".
పండగ మూడు రోజులు దగ్గరకి వచ్చే సరికి కొంచెం హడావుడి తగ్గేది, అమ్మకి, చెల్లికి తీరిక చిక్కేది, మా చిన్న ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో నింపేసేవారు, గొబ్బిళ్ళలో పెట్టడానికి నెల ముందు నుంచే పెరట్లో బంతి నారు పోసేవారు, సంక్రాంతికి పెద్ద పెద్ద ముద్ద బంతిపూలతో, రేగి పళ్ళతో గొబ్బెమ్మలని అలంకరించేవారు. బెల్లం తాటాకు బుట్టలలో చెరుకు గడ్డి కప్పి వచ్చేది, బుట్ట ఖాళీ అయిన వెంటనే నేను అన్నయ్య ఆ తాటాకు బుట్టని, చెరకు గడ్డిని అపురూపంగా మంచుకి తడవకుండా దాచుకునే వాళ్ళం. భోగి రోజు ఉదయాన్నే లేచి ఈ ఖాళీ బుట్టలన్నీ కలిపి పెద్ద భోగి మంట వేసేవాళ్ళం. అమ్మకి ఖాళీ ఉండదని మా పక్క ఊరిలోనే ఉండే మా పెద్దమ్మ మాకు అరిసెలు చేసి పంపించేది. సంక్రాంతి రోజుకి బేరం దాదాపుగా అయిపోతుంది, ఏ రోజు సరుకు ఆరోజు కొనుక్కునే కూలీలే కానీ రైతులేవరు తరువాత 20 రోజుల వరకు కొట్టు దగ్గరికి రారు.
సంక్రాంతి మధ్యాహ్నం నుంచి మమ్మల్ని వదిలేసేవారు, అప్పటి నుంచి తిరిగి బడి తెరిచే వరకు కోడి పందాలకి, సినిమాలకి, క్రికెట్ ఆటకి అంకితం అయిపోయేవాళ్ళం.
కాలం మారిపోయింది, ఇప్పుడు నేను ఊరికి దూరంగా చెన్నైలో ఉంటున్నాను, కిరాణా కొట్టు అన్నయ్య చూసుకుంటున్నాడు. మా మేనేజర్ దయతో సెలవు దొరికితే ఇంటికి వెళ్తాను, లేదంటే లేదు. వెళ్ళినా అక్కడ కూడా సంక్రాంతి ఇంతకు ముందులాగా జరగడంలేదు. గత కొద్ది సంవత్సరాలుగా రైతులకి అన్ని విధాలా కష్టాలే. ఇండియా బాగా అభివృద్ది చెందింది దాని ప్రభావం అన్ని ధరలపైనా పడింది ఒక్క రైతులకి చెల్లించే ధరలపైన తప్ప. ఇప్పుడు రైతులెవరూ సంక్రాంతి ముందులాగా చెసుకోవట్లేదు, ఒక్క సంవత్సరం లాభాలు వచ్చినా అంతకు ముందు చేసిన అప్పులపైన వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది, ఇంక పండగలు ఏమి పెట్టి చేసుకోమంటారు అని ఆడుగుతున్నారు.
కొందరు రైతుల పిల్లలు కష్టపడి డిగ్రీ వరకు చదివి హైదరాబాద్ రెడ్డి లాబ్స్, అరబిందో, హెట్రో డ్రగ్స్ లో పని చెస్తున్నారు, ఇంకొందరు నాలాగా అప్పులు చేసి ఎం.సి.ఎ లు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రతి నెలా ఇంటికి పంపే డబ్బే ప్రస్తుతం గ్రామ ఆర్ధిక వ్యవస్థకి ఊపిరులు ఊదుతోంది. గ్రామీణ భారతం చాలా కష్టాలలో ఉంది, ఒకప్పుడు రైతుల మీద ఆధారపడి సగర్వగా వర్ధిల్లన గ్రామ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం పరాన్న జీవిలాగ బ్రతుకుతోంది.
కన్‌జూమరిజం బాగ పెరిగింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేశాయి ఇండియా అభివృద్ది చెందింది అని చెప్పుకున్నా కూడా, పల్లెలలో రైతులు ఖర్చు పెట్టడం లేదు, ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, దాని ప్రభావం మా కిరాణా కొట్టు మీద కూడా పడింది.
రైతు బాగుంటేనే పల్లె బాగుంటుంది. రైతు కళ్ళల్లో ఆనందం ఉంటేనే సంక్రాంతి లక్ష్మి పల్లెకి వస్తుంది. సంక్రాంతి పట్నం పండగ కాదు, పల్లె పండగ. రైతులు ఆనందంగా లేరని పల్లెకి రాలేకపోతుంది, తనది కాని పట్టణానికి పోలేకపోతుంది, ప్రస్తుతం మా సంక్రాంతి లక్ష్మి ఎక్కడ ఉందో? మా పల్లెకి తిరిగి ఎప్పుడు వస్తుందో???
Saturday, January 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Sankranthi Lakshmi ekkada undo theliyadu kani, aa palleturulo matram ledu anipinchindi. endukante naa life lo modati sariga nenu sankranthi panduga palle lo jarupukundamani thega muchata padi vella oka palle ki. maa friends ki , maa office vallaki andaraki chalaa goppaga cheppi vella nenu panduga chalaa baga jarupuko bothunnaa ani. thira akkadiki velli chuste prati roju naku shock la mida shock lu thagilevi. 3/4 rojulu jarupukone 'peddaa panduga' lo naku okka roju kuda panduga vathavaranam kanipinchaledu :(( chala ascharyam vesindi naku pallello kante town/city lone pandugalu baga jaruguthunnay anipinchindi. akkada oka bogi manta ledu, oka bommala koluvu ledu, oka manchi rangula muggu ledu, gobbemmalu levu, kotha battala thala thalalu levu, poni oka cinema kuda ledu...emi levu.
mamulu roju laga gadisay aa panduga rojulu kuda !!! naa asalanni budidalo posina panneru ayindi. pallelaki malli manchi rojulu vachedeppudoo, a kala kala lu thirigi chuse deppudo...
"రైతుమారాజులకి" - maMci mATa.
IMHO... Gramala nunchi vachhi chaduvukunna yuvatha pallela ki malli kala teesukuravadaniki edo okati cheyyaali .... COLD STORAGES petti rytulaku reasonable rates ki rent ki iste.... oka vidham ga sayapadagalamemo ??? alochiste prati samsyaku parishkaram vuntundi... Kani chaduvukunna yuvatha prastutam Alochinchistoandaaaa ??? Idi alochinchalsina vishayame *******
యేనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యేనన్నట్టు, కాలం కలిసొచ్చి పంటలు పండి బతుకు కొంచెం పచ్చబడినా, కలిసిరాక పొలాలు యేళ్లతరబడి బీడుబోయినా అభిమానం చంపుకొని ఇంకో దారి చూసుకుందామనుకోవడం సులభంగా జరగదు. రైతు ఎప్పటికీ మారాజే. పిచ్చిమారాజు పాపం.
Post a Comment