Sunday, March 9, 2008

తరాలను తీర్చిదిద్దిన చందమామ

మా నాన్నగారు మాకు నేర్పిన ఒక మంచి అలవాటు పుస్తకాలు చదవడం. మాకు చిన్నతనంలోనే రామాయణ, భాగవతాలను పరిచయం చేశారు. అప్పట్లో రాజమండ్రి నుంచి గొల్లపూడి వీరాస్వామీ & సన్స్ వాళ్ళు తెలుగులో ముద్రించే బాలల బొమ్మల రామాయణం, మహాభారతాలు, ఇంకా తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలు, గద్య భాగవతం ఇలాంటి పుస్తకాలెన్నో మాకు చిన్నతనంలోనే కొని ఇచ్చి చదివించేవారు. అప్పటికి టి.వి. ఇంతటి విశ్వరూపం ధరించలేదు, ఆ పల్లెటూళ్ళో మాకు ఉండే సరదాలలో కధల పుస్తకాలు సింహభాగం వహించేవి.

నాలగవ తరగతిలో ఉండగా అనుకుంటాను,ఒకసారి నాన్నగారు మా ముగ్గురిని తీసుకుని మా ఇంటికి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న శాఖాగ్రంధాలయానికి తీసుకుని వెళ్ళి మాకు ఒక క్రొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. చిన్నఫ్ఫుడు చాలా ఇష్టంగా చదివింది చందమామ పుస్తకం. ప్రతి నెలా సుమారు 7 లేదా 8 వ తారీఖులలో మా గ్రంధాలయానికి వచ్చేది. ఇది కాకుండా బాలజ్యోతి, బుజ్జాయి కూడా వచ్చేవి. ప్రతి నెలా క్రొత్త చందమామ చదివే వరకు ఎంతో ఆతృతగా ఉండేది. నేను వెళ్ళేసరికి అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే నేను ఇంక అతని ప్రక్కనే కూర్చుని ఎప్పుడు వదులుతాడా అని చూసేవాడిని. చందమామ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చదివేవారు, ఒకవేళ పిల్లలు వచ్చినపుడు చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే అక్కడ ఉండే లైబ్రేరియన్ వాళ్ళ దగ్గర తీసేసుకుని మాకు ఇప్పించేవాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చేదే వీటి కోసం, వాళ్ళు లేనప్పుడు మీరు చదవండి అని వాళ్ళకి చెప్తుంటే ఆయనమీద ఎంతో ఇష్టం కలిగేది.

చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్తితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు,దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధా చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఎదో ఒక విలువని భోధించేటట్టుగా ఉండేవి. నీతి సూత్రం కానీ, తత్వశాస్త్రం కానీ మనకి సోదోహరణంగా వివరిస్తే బాగా అర్దం అవుతుంది, అందుకే వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే నీతి సూత్రాలన్నీ మనకి కధలలో చేర్చి జనానికి అర్దమ అయ్యే విధంగా రామాయణ, భాగవతాలల రూపంలో చెప్పారు కదా. చదమామలో ఎత్తుగడ కూడా ఇదే, ఒక కధ చెప్పి అందులో ఎలా ప్రవర్తించకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో చిన్నపిల్లలకి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తుంది. పూర్వకాలంలో గురుకులాలలో ఇలా కధల ద్వారా నీతిని చెప్పడం (చిన్నయసూరి పంచతంత్రం లో కధల ద్వారా మూర్ఖులయిన రాజకుమారులను మార్చినట్టు) ఉండేది, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలో అది సాధ్యం కావడంలేదు, అమ్మ నాన్నలకు కధలు చెప్పే తీరిక ఉండదు, సరిగ్గా ఇక్కడే చందమామ ఒక అద్భుతమయిన పాత్ర పోషించింది. మన పురాతన విద్యావిధానంలోని కధాసాంప్రదాయాన్ని ముద్రణా వ్యవస్థ ద్వారా చిన్నారులకు అందించింది.

చిన్న చిన్న కధల ద్వారా నీతిని భోధించడమే కాదు, లౌక్యంగా ఎలా ఉండాలో చందమామలోని గడసరి కోడళ్ళు చెప్పేవారు. ఒక విషయాన్ని వేరే విధంగా ఎలా అలోచించాలో (లేటరల్ థింకింగ్), నాణేనికి రెండో వైపు చూడడం ఎలాగో భేతాళ కధల ద్వారా నేర్పేది. అందులో ఉండే బొమ్మలు (వడ్డాది పాపయ్య బొమ్మలయితే మరీను) మనలను చదివించేటట్టు పురికొల్పుతాయి. ప్రతి పేజీలోను ఒక బొమ్మ తప్పకుండా ఉండేది.నేను ఈరోజు మంచీ చెడూ, తప్పూ ఒప్పూ అలోచించగలుగుతున్నాను అంటే దానిలో చందమామలో చదివిన కధల ప్రభావం చాలా ఉంది. మా ఊరి లైబ్రరీ గోడ మీద ముట్నూరి కృష్ణరావు గారి మాటలు ఇలా రాసి ఉండేవి " ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను" అని. ఈరోజు నా సరదాలలో సినిమాలు, టి.వి, అంతర్జాలం ఎన్ని వచ్చినాకానీ క్రొత్త పుస్తకం చూడగానే ఏదో తెలియని ఆనందం, అది చందమామ అయితే నిజంగా చిన్నపిల్లవాడిని అయిపోతాను.

కాలం చాలా శక్తివంతమయింది, సమస్త ప్రపంచం కాల ప్రభావానికి లోను అవుతుంది, చందమామ కూడా. కాలవశాన చందమామ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇదివరకు వచ్చే కధలు, అప్పటి భాషా చందమామలో ఇప్పుడు కనిపించడం లేదు. నాకు అనిపిస్తూ ఉండేది, చందమామలోని పాత కధలన్నీ తిరిగి ముద్రించుకుంటూ పొతే బాగుండు అనీ, వారి దగ్గర 60 సంవత్సరాల బాల సాహిత్యం ఉంది, అది రాబోయే తరానికి పరిచయం చేస్తే బాగుండు అనీన్నూ. ఈ మధ్య వారు మొదలుపెట్టిన అంతర్జాల ఎడిషన్ ద్వారా ఇది తీరగలదు అని సంతోషంగా ఉంది. ఎన్నో తరాలని తీర్చిదిద్దిన చందమామ రాబోయే తరాలకోసం సిద్దం అవుతోంది.

6 comments:

Anonymous said...

చాలా మంచి వార్త చెప్పారు. చందమామ రావే...జాబిల్లి రావే...

రానారె said...

జాటర్ ఢమాల్... మీకు చాలా మంచి అలోచనలున్నాయి. అభిప్రాయాలదేముందిలెండి కొత్త ఆలోచనలు వచ్చేకొద్దీ పాతబడిపోతుంటాయవి. :)

Ramakrishna Bysani said...

రానారె గారు, మీవంటి చెయ్యి తిరిగిన బ్లాగర్ నా బ్లాగులన్నీ చదివి మీ వ్యాఖ్యలు వ్రాయడం చాలా ఆనందపరిచింది.

kanthisena said...

చందమామ అనుభూతులు నిజంగా బాగున్నాయి. బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు అందులోనూ చందమామతో కలగలసిన పసితనాన్ని ఎవరూ మరువలేరు. ఈ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన ఏకైక జాతి సంపద, జాతీయ సంపద చందమామ ఒక్కటే కదా...

kanthisena said...

చందమామతో మీ అనుభూతుల గురించి ఇప్పుడే చదివాను. చందమామతో నా మూడు పదులు అనుబంధాన్ని ఇతరులతో పంచుకోవాలని సాగించిన అన్వేషణ చివరకు ఆ పత్రిక ఆన్‌లైన్‌లోనే ఉద్యోగం పొందగల అపూర్వమైన అవకాశాన్ని నాకు ఈ మధ్యే ఇచ్చింది. మీరన్నది నిజం. పిల్లలతో గడిపేందుకు, వారి బాల్య కౌతుకాలను పరామర్శించేందుకు తగిన సమయం తల్లిదండ్రులకు లేని తరుణంలో చందమామ కొన్ని తరాల పిల్లలను ప్రేమగా పలకరించింది. పిండి వెన్నెల చల్లదనంతో పిల్లల బాల్యాన్ని తడిపింది. మీరూ, నేనూ, ఇలా ఎందరూ కొన్ని తరాల పిల్లలు చందమామ చంద్ర కాంతుల జ్ఞాపకాలతో బాల్యాన్ని గడిపేశారు..మన తర్వాతి తరం పిల్లలకు చందమామ జ్ఞాపకాలు మిగలాలంటే మీరు ఇంకా ఇలాంటి అనుభవాలను వీలు చూసుకుని అక్షరాల్లో పెడితే చాలా బాగుంటుంది కదూ. ఆలోచించండి. చందమామ ఆన్‌లైన్ ఎడిషన్ పాత, కొత్తల మేలు కలయికతో పిల్లల, పెద్దల ఆదరాన్ని, అబిమానాన్ని చూరగొనాలనే చిరుకోరికతో ముందుకు వస్తోంది. చందమామ అభిమానిగా మీరు ఆన్‌లైన్ చందమామను కూడా చూడాలని, నాణ్యత కోసం చేసే ప్రయత్నంలో దానికి సూచనలు, మంచిమాటలు పంపాలని ఆశిస్తూ, ఇలా అనుకోకుండా బ్లాగు‌లో కలిసినందుకు ఎంతగానో సంతోషిస్తూ...

ఆన్‌లైన్ చందమామను ఇక్కడ చూడండి
http://telugu.chandamama.com

చందమామ జ్ఞాపకాలతో కూడిన నా కొత్త బ్లాగును చూడండి
http://blaagu.com/chandamamalu

Vasu said...

chaala baaga chepparu. nakeppudoo anipistundi, ee generation pillalu velaki velu petti Harry potter lati pustakaalu tega chaduvutunnaaru kaani chandamama lati pustakala joliki vellatledentani. Telugu chadavatam rakapovadamaa lekaa talli tantandrulu alavatu cheyyakapovadamo teliyadu.