Monday, July 28, 2008

అయితే ఏమిటి?

కాంగ్రేస్ పార్టీ(దాని మిత్ర పక్షాలు): -
అయితే ఏమిటి? అప్పుడెప్పుడో అయోధ్యలో ఏదో జరిగింది, దాని ప్రభావమే ఇవన్నీ...సమాజంలో ఒక్క వర్గాన్నే పోలీసులు లక్ష్యం చేసుకుంటున్నారు.
భా.జ.పా (దాని మిత్ర పక్షాలు): -
అయితే ఏమిటి? పోటా రద్దు ఫలితమే ఇవన్నీ, మా పాలన అద్భుతం, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఇవన్నీ.
అధికారులు: -
అయితే ఏమిటి? ప్రాజెక్ట్‌లలో మనకు రావలసిన పెర్సెంటేజ్ మనకి వస్తుంది కదా?
రాజకీయనాయకులు: -
అయితే ఏమిటి? మనకు రావలసిన అల్ప సంఖ్యాక వర్గాల వోట్లు మనకే వస్తున్నాయి కదా?
పోలీసులు: -
అయితే ఏమిటి? పంచాయితీలలో, సెటిల్‌మెంట్‌లలో మనకి బాగానే డబ్బులు వస్తున్నాయి కదా?
ప్రజలు:
అయితే ఏమిటి? అది అది వాళ్ళ ఖర్మ, ప్రభుత్వం ఎంత మంచిదో... మాకు రెండు రూపాయలకి బియ్యం, ఉచితంగా విద్యుత్తు, రంగు టి.విలు ఇస్తుంది కదా?

Friday, March 21, 2008

నాకు ఉద్యోగంబొచ్చిన విధంబెట్టిదనిన...

నేనేమీ అష్ట కష్టాలు పడి ఉద్యోగం తెచ్చుకోలేదండోయ్. కానీ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి కదా...అందుకే ఈ టపా...
మొత్తానికి కష్టపడి ఎం.సి.ఎ పూర్తిచేసి సినిమాలలో నిరుద్యోగి అని చూపెట్టడానికి సింబాలిక్ గా వాడతారే అలాంటి ఫైల్ లో నా సర్టిఫికెట్లు పెట్టుకుని ఈ విశాల ప్రపంచంలోకి వచ్చిపడ్డాను.మొదటి మజిలీ బెంగుళూరు. అక్కడ కనపడిన ప్రతి సాఫ్ట్‌వేర్ కంఫెనీలోనూ నా రెజూమే ఇస్తూ పొయాను కానీ పెద్ద లాభం ఏమీ లేదు. అప్పటికే ఒకసారి పట్ని కంప్యూటర్స్, టి.సి.ఎస్, ఇన్‌ఫొసిస్ లాంటి అన్ని కంపెనీలపైన దాడి చేశాను. మొత్తానికి 2004 జనవరి ఒకటిన టి.సి.ఎస్ ఇంటర్వ్యూ మళ్ళీ హాజరు కావడానికి భాగ్యనగరం వచ్చాను.అదే వారంలో అక్కడ ఒక రాత పరీక్ష, ఒక సాంకేతిక ఇంటర్‌వ్యూ హాజరు అయ్యాను, ఇక చివరి ఇంటర్‌వ్యూ కోసం ఎదురు చూస్తుంటే వాడేమో దాదాపు మూడు వారాలు ఎదురు చూసేటట్టు చేసి ఏమి చెప్పడంలేదు. ఈ లోపు పూణే నుంచి కాన్‌బే వాడు రమ్మని మెయిలు చేశాడు. ఇక్కడ వీడు ఏ విషయం తేల్చడం లేదు. మళ్ళీ పూనే వెళ్ళి రావడం అంటే బోలెడు ఖర్చు, ఏమి చేద్దాం అని ఆలోచించి "ఏ పుట్టలో ఏ పాము ఉందో" అని వెళ్ళడానికే నిర్ణయించుకుని జనవరి 30 బయల్దేరి పూణే వెళ్ళాను.
శనివారం ఒక రాతపరీక్ష పెట్టాడు, అది బాగానే చేశాను, తరువాత రోజు గ్రూపుడిస్కషన్ ఉంది అన్నాడు. అసలే మనకి ఆంగ్ల పరిజ్ఞానం ఎక్కువేమో కొంచెం తత్తర పడుతూ రెండో రోజు వెళ్ళాను. అక్కడేమో మా గ్రూపూలో మొత్తం 11 మంది ఉన్నారు, వాళ్ళలో ఒక్కడే తెలుగువాడు(సంతోష్). మాకు అందరికీ ఒక తెల్ల కాగితం, కలం ఇచ్చారు. మాకు ఒక విషయం ఇచ్చి ఒక్క నిముషం సమయం ఇస్తాము మీ భావాలన్నీ వ్రాసుకుని, మీ వాదన మొదలు పెట్టండి అన్నారు. చుట్టూ మొత్తం 8 మంది న్యాయ నిర్ణేతలు ఉన్నారు. అప్పుడు మాకు ఇచ్చే విషయం చెప్పారు "ఏదయినా మంచి పని చెయ్యడానికి చెడ్డ దారులు ఉండవు" అని.
ఆ తరువాత ఒక్క నిముషం అందరూ తెగ వ్రాసేశారు. నా మెదడు అప్పటికే పని చెయ్యడం మానేసింది. ఈలోపే వాదన మొదలయ్యింది, ఏమిటో మట్లాడేస్తున్నారు, కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 7/8 నిముషాలు ఏమి మాట్లాడలేదు. తరువాత ప్రయత్నిస్తే పొయేదేముందిలే అని నోరు తెరిచాను. వీళ్ళందరికీ అడ్డంగా వెళ్దామని, "మంచి పనులు, చెడ్డ పనులు ఉండవు అంతా మనం చూసే దానిపై ఆధారపడి ఉంటుంది" అని మొదలు పెట్టాను. వెంటనే మిగిలిన 10 మంది నన్ను ఖండించారు, సమయం మించి పోతుంది నా అభిప్రాయాన్ని ఎలా బలపరుచుకోవాలో అర్దం కావడంలేదు.
కొంచెం సమయం పోయాక సంతోష్ ఒకే ఒక్క మాట చెప్పాడు, "బహుశా అందరికీ రామాయణం తెలుసు అనుకుంటాను, దానిలో రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు, వాలిని చంపడం మంచి పనే, కానీ చేసిన విధానం చెడ్డది, కాబట్టి ఏదయినా మంచి పని చెయ్యడానికి చెడ్డ దారులు కూడా ఉంటాయి" అని పూర్తి చేశాడు. కొట్టాడురా కుంభస్థలం మీద అనుకున్నాను, అందరూ ఒప్పేసుకున్నారు ఇప్పుడు అందరూ అనుకూలంగానే మాట్లాడుతున్నారు.
వీడేమో పురాణాలనుంచి ఉదాహరణ తీసుకున్నాడు, నేను చరిత్ర నుంచి ఉదాహరణ తీసుకుందాం అనుకుని మా గురువు గారు చాణక్యుడిని తలచుకుని చెప్పాను "అందరికీ చరిత్ర, దానిలో చాణక్యుడి గురించి తెలుసు ఆయన చేసిన పనులన్నీ విడి విడిగా చూస్తే రాజ్యాలను కూల్చడమే, మోసం ద్వారా చంద్రగుప్తుడిని రాజుని చెయ్యడమే కానీ దాని వెనుక ఉన్న కారణం భారతదేశంలో మొదటి చక్రవర్తిని తయారు చెయ్యడం చిన్న చిన్న ముక్కలుగా ఉన్న షోడశ గణరాజ్యాలన్నీ ఒక్క చక్రవర్తి కిందకి తీసుకురావడం, మరొక అలెగ్జాండర్ ఇటు వైపు చూడకుండా చెయ్యడం. విడి విడిగా చూస్తే చేసినవన్నీ చెడ్డ పనులులాగే కనిపిస్తాయి, కానీ దాని వెనుక ఉన్న కారణం వేరు, అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది, బిన్ లాడేన్ కి కూడా తను చెసేవన్నీ మంచి పనులులాగే అనిపిస్తాయి తన తర్కం తనకి ఉంటుంది. ఒకే పని కొందరికి మంచిగా అనిపించవచ్చు కొందరికి చెడ్డగా అనిపించవచ్చు" అని ముగించాను. దాని పైన ఇంకా కొంద వాదన జరిగినా నేనేమీ మాట్లాడలేదు.
ఒక అర్దగంట తరువాత ఫలితాలు వచ్చాయి. మొత్తం ఆరుగురిని ఎన్నుకున్నారు మొదటి పేరు సంతోష్ ది, రెండవది నాది. అప్పుడు నాకు అనిపించింది మూడు సంవత్సరాలు చదివిన ఎం.సి.యె పుస్తకాలు కాకుండా వాడికి చిన్నప్పుడు చదివిన రామాయణం, నాకు ఎంతో ఇష్టంగా ఎన్నోసార్లు చదువుకున్న "ఆర్య చాణక్య" పుస్తకం మాకు ఉద్యోగాలు తెప్పించాయి. ఫిబ్రవరి ఒకటిన నాకు చివరి ఇంటర్‌వ్యూ అయింది, 5న రమ్మని మెయిల్ వచ్చింది, 7న చేరిపోయాను. నేను చేరిన మూడు రోజులకి టి.సి.ఎస్ వాడు చివరి ఇంటర్‌వ్యూ కి రమ్మని చెప్పాడు. కానీ కాగల కార్యం చాణక్యుడు తీర్చాడు కదా. ఎప్పుడూ అనుకుంటాను "నేను గురువుగా భావించే చాణక్యుడే నాకు ఉద్యోగం ఇప్పించాడు" అని. ఆచార్య దేవోభవః

Sunday, March 9, 2008

తరాలను తీర్చిదిద్దిన చందమామ

మా నాన్నగారు మాకు నేర్పిన ఒక మంచి అలవాటు పుస్తకాలు చదవడం. మాకు చిన్నతనంలోనే రామాయణ, భాగవతాలను పరిచయం చేశారు. అప్పట్లో రాజమండ్రి నుంచి గొల్లపూడి వీరాస్వామీ & సన్స్ వాళ్ళు తెలుగులో ముద్రించే బాలల బొమ్మల రామాయణం, మహాభారతాలు, ఇంకా తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలు, గద్య భాగవతం ఇలాంటి పుస్తకాలెన్నో మాకు చిన్నతనంలోనే కొని ఇచ్చి చదివించేవారు. అప్పటికి టి.వి. ఇంతటి విశ్వరూపం ధరించలేదు, ఆ పల్లెటూళ్ళో మాకు ఉండే సరదాలలో కధల పుస్తకాలు సింహభాగం వహించేవి.

నాలగవ తరగతిలో ఉండగా అనుకుంటాను,ఒకసారి నాన్నగారు మా ముగ్గురిని తీసుకుని మా ఇంటికి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న శాఖాగ్రంధాలయానికి తీసుకుని వెళ్ళి మాకు ఒక క్రొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. చిన్నఫ్ఫుడు చాలా ఇష్టంగా చదివింది చందమామ పుస్తకం. ప్రతి నెలా సుమారు 7 లేదా 8 వ తారీఖులలో మా గ్రంధాలయానికి వచ్చేది. ఇది కాకుండా బాలజ్యోతి, బుజ్జాయి కూడా వచ్చేవి. ప్రతి నెలా క్రొత్త చందమామ చదివే వరకు ఎంతో ఆతృతగా ఉండేది. నేను వెళ్ళేసరికి అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే నేను ఇంక అతని ప్రక్కనే కూర్చుని ఎప్పుడు వదులుతాడా అని చూసేవాడిని. చందమామ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చదివేవారు, ఒకవేళ పిల్లలు వచ్చినపుడు చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే అక్కడ ఉండే లైబ్రేరియన్ వాళ్ళ దగ్గర తీసేసుకుని మాకు ఇప్పించేవాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చేదే వీటి కోసం, వాళ్ళు లేనప్పుడు మీరు చదవండి అని వాళ్ళకి చెప్తుంటే ఆయనమీద ఎంతో ఇష్టం కలిగేది.

చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్తితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు,దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధా చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఎదో ఒక విలువని భోధించేటట్టుగా ఉండేవి. నీతి సూత్రం కానీ, తత్వశాస్త్రం కానీ మనకి సోదోహరణంగా వివరిస్తే బాగా అర్దం అవుతుంది, అందుకే వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే నీతి సూత్రాలన్నీ మనకి కధలలో చేర్చి జనానికి అర్దమ అయ్యే విధంగా రామాయణ, భాగవతాలల రూపంలో చెప్పారు కదా. చదమామలో ఎత్తుగడ కూడా ఇదే, ఒక కధ చెప్పి అందులో ఎలా ప్రవర్తించకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో చిన్నపిల్లలకి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తుంది. పూర్వకాలంలో గురుకులాలలో ఇలా కధల ద్వారా నీతిని చెప్పడం (చిన్నయసూరి పంచతంత్రం లో కధల ద్వారా మూర్ఖులయిన రాజకుమారులను మార్చినట్టు) ఉండేది, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలో అది సాధ్యం కావడంలేదు, అమ్మ నాన్నలకు కధలు చెప్పే తీరిక ఉండదు, సరిగ్గా ఇక్కడే చందమామ ఒక అద్భుతమయిన పాత్ర పోషించింది. మన పురాతన విద్యావిధానంలోని కధాసాంప్రదాయాన్ని ముద్రణా వ్యవస్థ ద్వారా చిన్నారులకు అందించింది.

చిన్న చిన్న కధల ద్వారా నీతిని భోధించడమే కాదు, లౌక్యంగా ఎలా ఉండాలో చందమామలోని గడసరి కోడళ్ళు చెప్పేవారు. ఒక విషయాన్ని వేరే విధంగా ఎలా అలోచించాలో (లేటరల్ థింకింగ్), నాణేనికి రెండో వైపు చూడడం ఎలాగో భేతాళ కధల ద్వారా నేర్పేది. అందులో ఉండే బొమ్మలు (వడ్డాది పాపయ్య బొమ్మలయితే మరీను) మనలను చదివించేటట్టు పురికొల్పుతాయి. ప్రతి పేజీలోను ఒక బొమ్మ తప్పకుండా ఉండేది.నేను ఈరోజు మంచీ చెడూ, తప్పూ ఒప్పూ అలోచించగలుగుతున్నాను అంటే దానిలో చందమామలో చదివిన కధల ప్రభావం చాలా ఉంది. మా ఊరి లైబ్రరీ గోడ మీద ముట్నూరి కృష్ణరావు గారి మాటలు ఇలా రాసి ఉండేవి " ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను" అని. ఈరోజు నా సరదాలలో సినిమాలు, టి.వి, అంతర్జాలం ఎన్ని వచ్చినాకానీ క్రొత్త పుస్తకం చూడగానే ఏదో తెలియని ఆనందం, అది చందమామ అయితే నిజంగా చిన్నపిల్లవాడిని అయిపోతాను.

కాలం చాలా శక్తివంతమయింది, సమస్త ప్రపంచం కాల ప్రభావానికి లోను అవుతుంది, చందమామ కూడా. కాలవశాన చందమామ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇదివరకు వచ్చే కధలు, అప్పటి భాషా చందమామలో ఇప్పుడు కనిపించడం లేదు. నాకు అనిపిస్తూ ఉండేది, చందమామలోని పాత కధలన్నీ తిరిగి ముద్రించుకుంటూ పొతే బాగుండు అనీ, వారి దగ్గర 60 సంవత్సరాల బాల సాహిత్యం ఉంది, అది రాబోయే తరానికి పరిచయం చేస్తే బాగుండు అనీన్నూ. ఈ మధ్య వారు మొదలుపెట్టిన అంతర్జాల ఎడిషన్ ద్వారా ఇది తీరగలదు అని సంతోషంగా ఉంది. ఎన్నో తరాలని తీర్చిదిద్దిన చందమామ రాబోయే తరాలకోసం సిద్దం అవుతోంది.

Saturday, February 23, 2008

తెలుగులో టైపు చెయ్యడం ఇప్పుడు తేలిక

ఇప్పుడు బ్లాగర్లో తెలుగులోనే టైపు చేసుకోవచ్చోచ్...శోధనగారికి నెనర్లు మొత్తానికి ఒక అరగంట కష్టపడ్డాక మొత్తానికి అన్ని సెట్ చేసుకుని మొదటిసారి తెలుగులో టైపు చేసేసాను...

వాదనల వల్ల అభిప్రాయాలు మారవు...

విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో రాజమండ్రి నుంచి వచ్చిన శీనుగాడు, సూర్రెడ్డి ఒక రూములో ఉండేవారు. ఆప్పుడప్పుడూ నేను వాళ్ళ రూముకి వెళ్ళేవాడిని. ఇక్కడ వీళ్ళ గురించి కొంచెం చెప్పాలి. శీనుగాడికి ఏ విషయం అయినా వాదించడం అంటే ఇష్టం.సూర్రెడ్డికేమో ఏదీ తెగేదాకా లాగటం ఇష్టం ఉండదు. మేము ఏదయినా టెక్నికల్ విషయాలు, సబ్జెక్ట్, రాజకీయాలు ఏవయినా కానీ చాలా ఉత్సాహంగా మాట్లాడుకునేవాళ్ళం. శీనుగాడేమో ఏ విషయమైనా సరదాకి వాదన మొదలెట్టేవాడు, ఆ వెంటనే సూర్రెడ్డి "వాదనల వల్ల అభిప్రాయాలు మారవు..." అనేసి అక్కడ నుంచి వెళ్ళిపొయేవాడు.

అప్పట్లో నాకు అర్దం కాలేదు కానీ, చెన్నపట్నం వచ్చాక ఆ డైలాగ్ అనుభవం ద్వారా అర్దం అయింది. ఇక్కడ మన టీంమేట్స్ తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏ విషయం కూడా వాదించ కూడదు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ మారవు, తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అని వాదిస్తారు, వెంటనే సూర్రెడ్డిని తను అప్పట్లో చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకుని వాళ్ళతో వాదన చెయ్యడం ఆపేస్తాను, లేకపోతే "రామాయణం ముందు తమిళంలో రాస్తే వాల్మీకి దాన్ని కాపీ కొట్టాడు...." అంటే మనమేం చెయ్యగలం....

Saturday, January 12, 2008

ఎక్కడుందీ సంక్రాంతి లక్ష్మి???

ఎక్కడుందీ సంక్రాంతి లక్ష్మి???

సంక్రాంతి అనగానే గుర్తు వచ్చేది పల్లెటూరు... నా చిన్నప్పుడు నేను అనుభవించిన బాల్యం అంతా నా కళ్ళ ముందు తిరుగుతుంది. సంక్రాంతికి పది పదిహేను రొజుల ముందు మా ఇంట్లోను, మా కిరాణా కొట్టులోను హడవిడి మొదలయ్యేది. నాన్నగారు తణుకు నుంచి తెప్పించిన బెల్లం బుట్టలతో, అప్పటికే తెప్పించిన వేరుశన నూనె డబ్బాలతో మా చిన్న ఇంటిని దానిలోనే ఉన్న కొట్టుని నింపేసేవారు. ఆ పదిరోజులు నాన్నగారు, అమ్మ, అన్నయ్య, చెల్లి, నేను ఎప్పుడు అన్నం తినేవాళ్ళమో తెలిసేదికాదు. రైతుమారాజులకి పంటలు చేతికి వచ్చే కాలం, సంవత్సరం అంతా తీసుకెళ్ళిన సరుకులకి అప్పుడే డబ్బు ఇచ్చే వారు.

సంక్రాంతికి మా ఊరిలో అందరి ఇళ్ళల్లోను అరిసెలు తప్పకుండా వండేవారు. దానికోసం ఒకొక్క రైతు బెల్లం బుట్టలతోను, నూనె డబ్బాలతోను తీసుకుని వెళ్ళేవారు. మాకు కూడా చేతి నిండా డబ్బు ఉండే కాలం, అందరు సంక్రాంతి కి కొత్త బట్టలు వేసుకుంటే మేమేమో పాత బట్టలేసుకుని కిరాణా కొట్లో పని చెయ్యడం చాలా బాధ అనిపించేది కాని, సంక్రాంతి వెళ్ళగానే మాకు కూడా నాన్నగారు కొత్త బట్టలు కొనేవారు. నాకు సంక్రాంతికి ఒక జత, పుట్టిన రోజుకి ఒక జత ఇలా సంవత్సరానికి రెండే కొత్త జతలు, మిగిలినప్పుడంతా అన్నయ్యకి పొట్టి అయిపోయిన బట్టలే, అందుకని సంక్రాంతి కోసం చాలా ఎదురు చూసేవాడిని. కొట్లో పని చెయ్యకుండా బయటికి పోయి ఆడుకుంటాను అంటే అమ్మ బ్రహ్మాస్త్రం ప్రయోగించేది, "కొట్లో ఈ పది రోజులు అల్లరి మాని పని చెస్తేనే కొత్త బట్టలు అని...".

పండగ మూడు రోజులు దగ్గరకి వచ్చే సరికి కొంచెం హడావుడి తగ్గేది, అమ్మకి, చెల్లికి తీరిక చిక్కేది, మా చిన్న ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో నింపేసేవారు, గొబ్బిళ్ళలో పెట్టడానికి నెల ముందు నుంచే పెరట్లో బంతి నారు పోసేవారు, సంక్రాంతికి పెద్ద పెద్ద ముద్ద బంతిపూలతో, రేగి పళ్ళతో గొబ్బెమ్మలని అలంకరించేవారు. బెల్లం తాటాకు బుట్టలలో చెరుకు గడ్డి కప్పి వచ్చేది, బుట్ట ఖాళీ అయిన వెంటనే నేను అన్నయ్య ఆ తాటాకు బుట్టని, చెరకు గడ్డిని అపురూపంగా మంచుకి తడవకుండా దాచుకునే వాళ్ళం. భోగి రోజు ఉదయాన్నే లేచి ఈ ఖాళీ బుట్టలన్నీ కలిపి పెద్ద భోగి మంట వేసేవాళ్ళం. అమ్మకి ఖాళీ ఉండదని మా పక్క ఊరిలోనే ఉండే మా పెద్దమ్మ మాకు అరిసెలు చేసి పంపించేది. సంక్రాంతి రోజుకి బేరం దాదాపుగా అయిపోతుంది, ఏ రోజు సరుకు ఆరోజు కొనుక్కునే కూలీలే కానీ రైతులేవరు తరువాత 20 రోజుల వరకు కొట్టు దగ్గరికి రారు.

సంక్రాంతి మధ్యాహ్నం నుంచి మమ్మల్ని వదిలేసేవారు, అప్పటి నుంచి తిరిగి బడి తెరిచే వరకు కోడి పందాలకి, సినిమాలకి, క్రికెట్ ఆటకి అంకితం అయిపోయేవాళ్ళం.

కాలం మారిపోయింది, ఇప్పుడు నేను ఊరికి దూరంగా చెన్నైలో ఉంటున్నాను, కిరాణా కొట్టు అన్నయ్య చూసుకుంటున్నాడు. మా మేనేజర్ దయతో సెలవు దొరికితే ఇంటికి వెళ్తాను, లేదంటే లేదు. వెళ్ళినా అక్కడ కూడా సంక్రాంతి ఇంతకు ముందులాగా జరగడంలేదు. గత కొద్ది సంవత్సరాలుగా రైతులకి అన్ని విధాలా కష్టాలే. ఇండియా బాగా అభివృద్ది చెందింది దాని ప్రభావం అన్ని ధరలపైనా పడింది ఒక్క రైతులకి చెల్లించే ధరలపైన తప్ప. ఇప్పుడు రైతులెవరూ సంక్రాంతి ముందులాగా చెసుకోవట్లేదు, ఒక్క సంవత్సరం లాభాలు వచ్చినా అంతకు ముందు చేసిన అప్పులపైన వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది, ఇంక పండగలు ఏమి పెట్టి చేసుకోమంటారు అని ఆడుగుతున్నారు.

కొందరు రైతుల పిల్లలు కష్టపడి డిగ్రీ వరకు చదివి హైదరాబాద్ రెడ్డి లాబ్స్, అరబిందో, హెట్రో డ్రగ్స్ లో పని చెస్తున్నారు, ఇంకొందరు నాలాగా అప్పులు చేసి ఎం.సి.ఎ లు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రతి నెలా ఇంటికి పంపే డబ్బే ప్రస్తుతం గ్రామ ఆర్ధిక వ్యవస్థకి ఊపిరులు ఊదుతోంది. గ్రామీణ భారతం చాలా కష్టాలలో ఉంది, ఒకప్పుడు రైతుల మీద ఆధారపడి సగర్వగా వర్ధిల్లన గ్రామ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం పరాన్న జీవిలాగ బ్రతుకుతోంది.

కన్‌జూమరిజం బాగ పెరిగింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేశాయి ఇండియా అభివృద్ది చెందింది అని చెప్పుకున్నా కూడా, పల్లెలలో రైతులు ఖర్చు పెట్టడం లేదు, ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, దాని ప్రభావం మా కిరాణా కొట్టు మీద కూడా పడింది.

రైతు బాగుంటేనే పల్లె బాగుంటుంది. రైతు కళ్ళల్లో ఆనందం ఉంటేనే సంక్రాంతి లక్ష్మి పల్లెకి వస్తుంది. సంక్రాంతి పట్నం పండగ కాదు, పల్లె పండగ. రైతులు ఆనందంగా లేరని పల్లెకి రాలేకపోతుంది, తనది కాని పట్టణానికి పోలేకపోతుంది, ప్రస్తుతం మా సంక్రాంతి లక్ష్మి ఎక్కడ ఉందో? మా పల్లెకి తిరిగి ఎప్పుడు వస్తుందో???